- 12 మందిపై కేసు నమోదు
- ఇంటికొచ్చి కొట్టిన కార్పొరేటర్ క్యాండిడేట్ రాజు అనుచరులు
మంచిర్యాల, వెలుగు : ఓ బీఆర్ఎస్ లీడర్‌పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని 36వ డివిజన్ కాంగ్రెస్ క్యాండిడేట్ అగల్‌డ్యూటీ రాజుకు బీఆర్ఎస్ నాయకుడు కోన ప్రసాద్ అనుచరుల మధ్య బుధవారం పోలింగ్ సమయంలోనే గొడవ జరిగింది.
పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు సుమారు 30 మంది కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ ఇంటికి వచ్చి అతడిపై దాడి చేశారు. అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులపై కూడా దాడికి యత్నించారు. తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్‌ను బీఆర్ఎస్ నాయకులు వెంటనే మంచిర్యాల జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల మాజీఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు హాస్పిటల్‌కు చేరుకొని ప్రసాద్‌ను పరామర్శించారు.
అనంతరం ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి రామగుండం సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 12 మందిపై కేసు నమోదు చేసినట్లు నస్పూర్ ఎస్సై ప్రశాంత్ తెలిపారు. కాగా, కాంగ్రెస్ లీడర్లు అధికార బలంతో ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దివాకర్‌రావు ఆరోపించారు. ఈ దాడులను తాము చట్టపరంగా ఎదుర్కొంటామని, ఎవరికీ భయపడేది లేదని చెప్పారు.
